మరోసారి వేర్పాటువాదంతో ఏపీ నష్టపోకూడదని.. మూడు రాజధానులతోనే రాష్ట్రమంతటా అభివృద్ధి చెందుతుందని ఏపీ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దా?.. రాజధానిలో పేదలు ఎందుకు నివసించకూడదని ప్రశ్నించారు.
తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అమరావతి పేరుతో పాదయాత్ర చేయడం దేనికోసమని తమ్మినేని సీతారామ్ ప్రశ్నించారు. అసలు మూడు రాజధానుల ఏర్పాటుతో చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందేంటో తనకు అర్థం కావట్లేదన్నారు. రాజధాని విషయంలో కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం చేయాలనుకుంటున్నారా అని చంద్రబాబును నిలదీశారు.
ఈ మేరకు ఆదివారం స్పీకర్ తమ్మినేని సీతారామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు మళ్లీ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో వేరే వర్గాలే నివసించకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికే పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు ఏమీ వద్దని చేస్తున్న యాత్ర ఇదన్నారు. అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలన్నదే బాబు లక్ష్యమని.. ఒకే రాజధాని ఉండటంతో విభజన సమయంలో నష్టపోయామన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదని.. అన్ని రంగాల్లోనూ ఎంతో నష్టపోయామని పేర్కొన్నారు.
చంద్రబాబు దురాలోచనకు ఆయన అనుకూల మీడియా వత్తాసు పలుకుతోందని.. ఈ విషయాన్ని ఉత్తరాంధ్ర ప్రజానీకమంతా గమనించాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. ఈ అంశంపై మాట్లాడే హక్కు స్పీకర్‌గా తనకు ఉందన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు అసలైన ఉదాహరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు. కళ్యాణమస్తు పథకంతో 98.4 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు.