ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సోమవారం అధికారులు ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భపై ఉన్న వాయుగుండం సోమవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. మరికొద్ది గంటల్లో మధ్యప్రదేశ్ మీదుగా వాయువ్యవ దిశగా కదులుతూ మరింత బలహీనపడనుందని అధికారులు తెలిపారు. ఈ కారణంగా ఏపీలో వర్షాలు కురియనున్నాయి.ఇక మంగళవారం సముద్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగా మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. ఇదలా ఉంటే ఈనెల 18న ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉంటుందో చూడాలి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా అక్కడక్కడ భారీవర్షాలు కురిశాయి. చింతూరులో 4 సెంటీమీటర్లు, వీరఘట్టంలో 3.3, జియ్యమ్మవలసలో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమైదనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.