తిరుమల కొండలు. ఎటుచూసినా పచ్చదనం.. గోవింద నామస్మరణతో ప్రశాంతంగా ఉంటాయి. తిరుమలకు వెళ్తే ఆ ప్రకృతి సౌందర్యానికి మైమరచిపోవాల్సిందే..! వన్యప్రాణుల సందడి, జలపాతాల సవ్వడులు అలరిస్తుంటాయి. ఇదంతా ఒకవైపే.. మరోవైపు నిత్యం తిరుమలకు వచ్చే వాహనాలతో సప్తగిరులను కాలుష్యం కమ్మేస్తోంది. శేషాచలంలోని పచ్చదనానికి, ప్రకృతి సౌదర్యానికి వాయుకాలుష్యం సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి చెంత కాలుష్యాన్ని తగ్గించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అడుగులు వేస్తోంది. తిరుమలలో కాలుష్యం తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తొలి ఎలక్ట్రానిక్ బస్సు తిరుపతి చేరుకుంది. 49 బస్సులు రానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ బస్సులను ప్రారంభించేందుకు ఆర్టీసి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.