ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతమై మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరుందిన బలపం పంచాయతీలోని 33 గ్రామాలకు గిరిజనులకు అశ్వాలే వాహనాలుగా మారాయి. ఈ పంచాయతీలో 33 గ్రామాలు ఉండగా ఒడిస్సా సరిహద్దు గ్రామాలు సైతం ఇదే మార్గంగా వచ్చి వారపు సంతలలో నిత్యవసర సరుకులు కొనుగోలు చేసుకోవలసిన పరిస్థితి. చిన్నారులు మొదలు ప్రతి ఒక్కరూ అస్వాలపైనే వారపు సంతలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఎండైనా, వానైనా నిత్యవసర సరుకుల రవాణాలో అస్వాలదే ముఖ్య పాత్ర. సరైన రహదారిలేని, ప్రమాద భరిత వాగులలో సైతం అస్వాల మీదనే గిరిజనులు వారపు సంతలకు, డిఆర్ డిపోలకు వచ్చి నిత్యవసర సరుకులను గ్రామాలకు తీసుకు వెళ్తూ ఉంటారు.
అదే క్రమంలో అత్యవసర సమయాలలో గుర్రాలే ఆంబులెన్సులుగా వినియోగించుకోవలసిన దుస్థితి. ఈ క్రమంలో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు అశ్వం (గుర్రం) వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. ప్రతి ఏటా వర్షాకాలంలో వాగులు పొంగిపొర్లడం వాటి గుండా రాకపోకలు సాగిస్తూ గిరిజనులు ప్రమాదానికి గురికావడం పరిపాటిగా మారినప్పటికీ అటు పాలకులు గానీ, ఇటు అధికారులు కానీ వంతెనల నిర్మించడానికి కృషి చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం సరఫరా చేసి పంపిణీ చేస్తున్న రాజ్మా రాయితీ విత్తనాలను తీసుకువెళ్లేందుకు ఆ ప్రాంత గిరిజనులు వర్షాలను సైతం లెక్కచేయకుండా ఓ చిన్నారి యువకుడు రాయితీ విత్తనాలను అశ్వంపై తీసుకువెళ్లేందుకు డిఆర్ డిపోకు వస్తుండడం పెన్ పవర్ కెమెరాకు చిక్కింది.
స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకుని సంబరాలు జరుపుకున్న ప్రస్తుత కాలంలోనూ మారుమూల గిరిజన గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికైనా సంబంధిత శాఖలో ఉన్నతాధికారులు స్పందించి గిరి గ్రామాలకు సరైన రహదారి నిర్మాణాలు చేపట్టకపోయినప్పటికీ ప్రమాద భరితంగా ఉన్న కాలువల వద్ద వంతెనలు నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంతీయులు అభ్యర్థిస్తున్నారు.