అన్ని రంగాలలో మగవారితో పోటీపడుతున్న మహిళలు గణితంలో మాత్రం వెనకబడి ఉన్నారని తేలింది. ఔను మీరు విన్నది నిజమే. ప్రపంచవ్యాప్తంగా అబ్బాయిల కంటే అమ్మాయిలు గణితంలో వెనుకబడి ఉన్నారని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ నివేదిక స్పష్టం చేసింది. అయితే, దీనికి లింగ అసమానతలు, మూసధోరణే కారణమని యునిసెఫ్ నివేదిక పేర్కొంది. బాలికల కంటే అబ్బాయిలలో గణిత నైపుణ్యాలు 1.3 రెట్లు అధికంగా ఉన్నాయని తెలిపింది. గణితాన్ని అర్థం చేసుకోవడంలో బాలికల సహజ సామర్థ్యంలో అసమానతలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సహచరులు తరచూ అనుసరించే ప్రతికూల లింగ నిబంధనలు, సాధారణీకరణలు దోహదం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఇది బాలికల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, వారిని వైఫల్యానికి గురి చేస్తుందని వివరించింది. మొత్తం 100కిపై దేశాల్లో డేటాను విశ్లేషించి ‘‘ఈక్వేషన్‌ను పరిష్కరించడం: బాలికలు, బాలురు గణితాన్ని నేర్చుకోవడంలో సహాకారం’’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ‘‘అబ్బాయిలతో సమానంగా గణితాన్ని నేర్చుకునే సామర్థ్యం అమ్మాయిలకు ఉంది.. ఈ క్లిష్టమైన నైపుణ్యాలను పొందేందుకు వారికి లేనిది సమాన అవకాశం’’ అని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్యాథరీన్ రస్సెల్ అన్నారు.
‘‘అమ్మాయిలను వెనక్కి నెట్టే లింగ వివక్ష, ఆంక్షలను మనం తొలగించాలి.. ప్రతి బిడ్డకు సహాయం చేయడానికి మరింత కృషి చేయాలి.. పాఠశాలలో, జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను నేర్చుకోవాలి’’ అని ఆమె పేర్కొన్నారు. నివేదికలో 34 అల్ప, మధ్య ఆదాయ దేశాల డేటా విశ్లేషణ ప్రకారం బాలికలు అబ్బాయిల కంటే వెనుకబడి ఉండగా గ్రేడ్ 4 పాఠశాల విద్యార్థుల్లోని మూడొంతుల మంది కనీసం ప్రాథమిక సంఖ్యా నైపుణ్యాలను చేరుకోలేకపోయారు. అలాగే, 79 మధ్య, అధిక-ఆదాయ దేశాల నుంచి వచ్చిన డేటా 15 ఏళ్ల పాఠశాల పిల్లలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఇంకా గణితంలో కనీస నైపుణ్యాన్ని సాధించలేదని చూపిస్తుంది.
గణితం నైపుణ్యాలను నిర్ణయించే అంశంలో కుటుంబం సంపద కూడా కీలకమని నివేదిక తెలిపింది. నాల్గో తరగతికి చేరుకునే సమయానికి అత్యంత ధనిక కుటుంబాలకు చెందిన పిల్లలు పేద కుటుంబాల పిల్లల కంటే 1.8 రెట్లు సంఖ్యా నైపుణ్యాలను సంపాదించే అసమానతలను కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. బాలల విద్య, సంరక్షణ కార్యక్రమాలకు హాజరయ్యే పిల్లలు 15 ఏళ్లలోపు గణితంలో కనీస నైపుణ్యాన్ని సాధించని వారి కంటే 2.8 రెట్లు ఎక్కువగా ఉన్నారు.
కోవిడ్-19 మహమ్మారి ప్రభావం పిల్లల గణిత సామర్థ్యాలను మరింత తీవ్రతరం చేసిందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, ఈ విశ్లేషణలు ప్రస్తుతం పాఠశాలలో ఉన్న బాలబాలికలపై దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నాయి. అబ్బాయిల కంటే బాలికలు ఎక్కువగా పాఠశాలకు దూరంగా ఉండే దేశాలలో గణిత నైపుణ్యాల్లో అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందజేయడానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని యునిసెఫ్ పిలుపునిచ్చింది. ‘మధ్యలో బడి మానివేసిన పిల్లలందరినీ తిరిగి చేర్పించి, నిలుపుదల చేయడానికి, రెమిడియల్ తరగతులు నిర్వహించి, ఉపాధ్యాయులకు మద్దతు ఇవ్వడానికి, అవసరమైన బోధనా సాధనాలను అందించడానికి, పాఠశాలలు సురక్షితమైన, సహాయక వాతావరణాన్ని అందించేలా చూడాలని అప్పుడే పిల్లలందరూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారని’ నివేదిక వివరించింది. ‘‘అభ్యసిస్తున్న మొత్తం పిల్లల తరం ప్రమాదంలో ఉంది..శుష్క వాగ్దానాలకు ఇది సమయం కాదు. ప్రతి బిడ్డకు విద్యను అందజేయడానికి చర్యలు తప్పకుండా అవసరం’’ అని క్యాథరీన్ రస్సెల్ ఉద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa