అంతరించిన జీవరాశులను తిరిగి మళ్లీ పుట్టించేందుకు...ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మమ్మురం చేస్తున్నారు. నానాటికీ పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్. పర్యావరణం మారిపోతోంది. అడవులు తరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. మనుషుల వేట, వినియోగం పెరిగిపోతోంది. ఇవన్నీ కలిసి ఎన్నో రకాల జీవజాతులు అంతరించిపోతున్నాయని.. ఏడాదికి ఏడాది ఎన్నో జీవరాశులు విలుప్తమైపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా వందలు, వేల ఏళ్ల కిందట అంతరించిపోయిన జీవులను మళ్లీ పుట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని టాస్మానియా ప్రాంతంలో థైలసిన్లుగా పిలిచే జీవులు ఉండేవి. అటు శునకంలా, ఇటు పులిలా చారలతో ఉండే ఆ భిన్నమైన జీవి ఆ ప్రాంతానికే ప్రత్యేకం కూడా. వాటిని టాస్మానియన్ టైగర్లుగా పిలుచుకుంటారు. 1930లోనే అంతరించిన వీటిని మళ్లీ పుట్టించేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
భూమ్మీద నాలుగు వేల ఏళ్ల కిందట నిండా పొడవైన వెంట్రుకలతో అతి భారీ ఏనుగులు తిరుగాడేవి. వూలీ మమ్మోత్ గా పిలిచే ఆ భారీ ఏనుగులను తిరిగి పుట్టించేందుకు అమెరికాకు చెందిన కొలోసల్ బయో సైన్సెస్ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
మన దేశం కూడా అంతరించిపోయిన చీతాలను హైబ్రిడ్ విధానంలో మళ్లీ పుట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే విదేశాల నుంచి మన చీతాలను పోలిన చిరుతపులులను భారత్‌కు రప్పించే ప్రక్రియ మొదలుపెట్టారు. వాటి సాయంతో హైబ్రిడ్ చీతాలను పుట్టించనున్నారు.
అంతరించిపోయిన, ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్న జాతులను పునరుద్ధరించేందుకు.. క్లోనింగ్, బ్యాక్ బ్రీడింగ్, జీనోమ్ ఎడిటింగ్ అనే మూడు రకాల పద్ధతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొదటిది క్లోనింగ్.. ఏదైనా జీవి కణాలను సేకరించి పిండాన్ని రూపొందించడం ద్వారా అచ్చం అదే జీవిని పుట్టిస్తారు. ఇప్పటికే విస్తృతంగా వాడుతున్న విధానం ఇది. పూర్తిగా అంతరించిపోయిన జీవుల విషయంలో క్లోనింగ్ కుదరదు. అంతరించిపోయిన జాతికి అతి సమీప జాతి ఆధారంగా పూర్వపు జాతిని పుట్టించడం ‘బ్యాక్ బ్రీడింగ్’. ఉదాహరణకు పిల్లుల నుంచి ఒకనాడు అంతరించిన అడవి పిల్లి జాతిని పుట్టించడం అనుకోవచ్చు. ఇక ఎప్పుడో అంతరించిపోయిన జాతిని సరిపోలిన ఇప్పటి జంతువుల డీఎన్‌ఏలో మార్పులు చేసి.. పూర్వపు జాతిని పోలిన జీవులను పుట్టించడం జీనోమ్ ఎడిటింగ్. ప్రస్తుతమున్న ఏనుగుల డీఎన్‌ఏలో మార్పులు చేసి ఒకనాటి ‘మమ్మోత్’లను తిరిగి పుట్టించేందుకు హర్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.
ఎప్పుడో అంతరించిపోయిన జాతులను తిరిగి పుట్టించాలంటే వాటికి సంబంధించిన డీఎన్‌ఏ కావాలి. సాధారణంగా డీఎన్‌ఏ గరిష్ఠంగా 521 సంవత్సరాల పాటు ఉనికిలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసార్లు ఏకంగా ఆరున్నర కోట్ల ఏళ్ల కిందటే అంతరించిపోయినందున.. వాటిని తిరిగి పుట్టించడం సాధ్యం కాదని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa