టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టి నేటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. 2007 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. బ్రాడ్ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో 6 సిక్సులు కొట్టాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. యువరాజ్ సిక్సర్లకు సంబంధించిన ఈ వీడియోను ఐసీసీ సోమవారం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. యువరాజ్ సింగ్ ఈ లెవెల్‌లో విధ్వంసం సృష్టించడానికి కారణం లేకపోలేదు. ఈ తుఫానుకి కొన్ని నిమిషాల ముందు అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్, యువీ మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు యువీ... ‘‘అంతకుముందు ఆండ్రూ ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టాను. ఆ షాట్స్‌తో అతను తీవ్ర అసహనానికి గురయ్యాడు. లాస్ట్ బాల్ వేసిన తర్వాత నడుచుకుంటూ వెళుతూ నన్ను సెడ్జింగ్ చేశాడు... చెత్త షాట్స్ ఆడావు.. అంటూ హేళన చేశాడు. ఆ మాటకు నాకు కోపం వచ్చింది. నేను కూడా అంతే గట్టిగా బదులు ఇచ్చాను. అంతే మా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆండ్రూ ఫ్లింటాఫ్, చాలా కోపంగా నీ గొంతు కోస్తానంటూ బెదిరించాడు. నేను నా బ్యాటుని చూపించి, దీంతో నిన్ను ఎక్కడ కొడతానో నీకు బాగా తెలుసు అంటూ సమాధానం ఇచ్చాను.
ఈ సంఘటన తర్వాతే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నా. ఆ తర్వాతే స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌కి వచ్చాడు. ప్రతీ బంతినీ స్టేడియం బయటపడేయాలని కసిగా బాదాను. నిజానికి ఆ రోజు నేను ఆడిన షాట్స్‌లో కొన్ని నా కెరీర్‌లో ఎప్పుడూ ఆడనివి. స్టువర్ట్ బ్రాడ్‌కి అప్పటికీ పెద్దగా అనుభవం లేదు. అయితే నన్ను కంట్రోల్ చేయడానికి అతను చాలా ప్రయత్నించాడు. యార్కర్లు వేసినా సరే, నేను వాటిని సిక్సర్లుగా మలచగలిగా.. ఆఖరి బంతిని కూడా సిక్సర్‌గా మలిచిన తర్వాత ఫ్లింటాఫ్ వైపు చూసి ఓ నవ్వు నవ్వాను. అప్పటికే అతని ముఖం మాడిపోయి ఉంది.... నేను అలా ఆడతానని అతను అస్సలు ఊహంచలేదు. నిజానికి నేను కూడా ఆ ఇన్నింగ్స్ ఊహించలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్.
#OnThisDay in 2007 – 6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
Yuvraj Singh became the first man to hit six consecutive sixes in a T20I and also recorded the fastest fifty in the format
— ICC (@ICC) September 19, 2022