కేంద్ర మంత్రి, బీజేపీ నేత నారాయణ్ రాణేకు బోంబే హైకోర్టు మంగళవారం పెద్ద షాక్ ఇచ్చింది.మహారాష్ట్రలోని జుహు లో ఆయన బంగళాలో అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా రూ.10 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.అనుమతి పొందిన ప్లాన్‌ను ఉల్లంఘించి బంగళాలో మార్పులు చేసినట్లు బృహన్ముంబై నగరపాలక సంస్థ (బీఎంసీ) గతంలో నారాయణ్ రాణేకు నోటీసు ఇచ్చింది.
ముంబై నగర పాలక సంస్థ చట్టంలోని సెక్షన్ 351 ప్రకారం ఈ నోటీసును కే-వెస్ట్ వార్డ్ అధికారి జారీ చేశారు. ఈ బంగళా వినియోగంలో అనధికారిక మార్పులు చేసినట్లు ఆరోపించారు సంస్థ అనుమతించిన ప్లాన్‌ను ఉల్లంఘించారని ఆరోపించారు.ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన , నారాయణ్ రాణే కుటుంబం మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.జుహులో సముద్రంవైపు సింహద్వారంగల బంగళాను కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనలను ఉల్లంఘించి రాణే నిర్మించారని సామాజిక కార్యకర్త సంతోష్ దౌండ్కర్ ఫిర్యాదు చేశారు. దీంతో బృహన్ముంబై నగర పాలక సంస్థ (BMC) అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో తనిఖీలు చేశారు. రాణే వద్ద ఉన్న దస్తావేజులు, ఫొటోలను పరిశీలించారు.నారాయణ్ రాణే అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ, ఈ బంగళా నిర్మాణానికి తాను అన్ని నిబంధనలను పాటించానని చెప్పారు. అన్ని నిబంధనలను పాటిస్తూనే ఈ
బంగళాను నిర్మించినట్లు తెలిపారు. తాను ఎటువంటి నిబంధనలనూ ఉల్లంఘించలేదని చెప్పారు. శివసేన, మరీ ముఖ్యంగా ఉద్ధవ్ థాకరే తనకు ఈ నోటీసులు పంపించారని ఆరోపించారు.శివసేనలో తిరుగుబాటు రావడంతో ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.