కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి చీతాలను తీసుకువచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చీతాల విషయంపై చర్చ జరుగుతోంది. ఎప్పుడో 70 ఏళ్ల కిందటే అంతరించిపోయిన చీతాల జాతిని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ఈ సందర్భంగా వన్యప్రాణులపై పరిశీలన చేసే సీనియర్ జర్నలిస్టు కబీర్ సంజయ్ తాను రాసిన పుస్తకంలో చీతాల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చీతాల వేగం, శరీర నిర్మాణం, జీవన శైలి గురించి అధ్యయనం చేసి పలు అంశాలను వివరించారు.
చీతా కొన్ని రకాల కార్ల కంటే కూడా వేగంగా పరుగెడుతుంది. కేవలం 3 సెకన్లలోనే గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అయితే ఈ గరిష్ఠ వేగాన్నిఎక్కువ సేపు కొనసాగించలేదు. కేవలం 30 సెకన్లలో అలసిపోవడం మొదలవుతుంది. ఆలోగా వేటాడకపోతే జంతువును వదిలేస్తుంది. చీతాల వేగం చాలా ఎక్కువైనా.. వాటి మొత్తం బలం, సామర్థ్యం తక్కువ కావడమే దీనికి కారణం. అసలు వేటలో చీతాల సక్సెస్ రేట్ 40 నుంచి 50 శాతం మాత్రమే. అంటే పది సార్లు జంతువు వెంట పడితే అందులో నాలుగైదు సార్లు మాత్రమే వాటిని పట్టుకోగలుగుతుందన్న మాట. ఇక వేట కోసం పరుగెత్తాక చాలాసేపు విశ్రాంతి తీసుకుంటుంది.
చీతాలకు కళ్ల నుంచి నోటిదాకా నల్లని చారలు ఉంటాయి. ఇవి సూర్యరశ్మి ప్రతిఫలించకుండా (గ్లేరింగ్) తోడ్పడతాయని.. దూరంలో ఉన్న జంతువులను సైతం స్పష్టంగా కనబడేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా పులులు, చిరుతలు వంటివి పగటి పూట విశ్రాంతి తీసుకుంటాయి. రాత్రిపూట యాక్టివ్ గా వేటాడుతాయి. అయితే చీతాలు మాత్రం ఉదయం, సాయంత్రం వేటాడుతాయి. రాత్రుళ్లు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాయి. చీతాలు సాధారణంగా మనుషులు, నివాసాల్లో ఉండే పెంపుడు జంతువుల జోలికి రావు. అవి అడవి జంతువులను మాత్రమే వేటాడుతాయి. చీతాల శరీరం బాగా వేగంగా పరుగెత్తేందుకు అనుగుణంగా ఉంటుంది. ఊపిరితిత్తులు, గుండె పెద్దగా ఉంటాయి. శరీరం బాగా సాగుతుంది. వాటి పాదాల దిగువన గట్టిగా ఉండి.. పరుగెత్తేందుకు సహకరిస్తుంది. దీనికి ఉండే బలమైన తోక వేగంగా పరుగెత్తేటప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి తోడ్పడుతుంది. చీతాలు మూడు, నాలుగు రోజులకోసారి వేటాడుతాయి. అదే తరహాలో నీళ్లు తాగుతాయి. చాలా వరకు ఒంటరిగా వేటాడుతాయి. అప్పుడప్పుడు మగ చీతాలు మాత్రం కలిసి వేటాడుతాయి. ఆడ చీతాలు ఒంటరిగా జీవిస్తాయి. పిల్లి జాతికి చెందిన సింహాలు, పులులు, చిరుతల తరహాలో చీతాలు గర్జించలేవు. పిల్లుల్లా చప్పుడు చేస్తాయి. ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం కలిగినప్పుడు గుర్రు గుర్రుమంటూ శబ్దం చేస్తాయి. అడవుల్లో అయితే చీతాలు పది పన్నెండేళ్లు బతుకుతాయి. అదే అభయారణ్యాల్లో, జూలలో 20 ఏళ్ల దాకా బతికే అవకాశం ఉంది.