టీడీపీ నాయకులను పరామర్శించేందుకు తొలిసారి ఓ జైలుకు వచ్చానని చిత్తూరు జైలు బయట చేసిన ప్రసంగంలో చంద్రబాబు గారు గొప్పగా చెప్పుకున్నారు అని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు చిత్తూర్ పర్యటన మీద స్పందిస్తూ... 1978లో మొదటిసారి ఎమ్మెల్యే కావడానికి ముందే శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఉన్నాగాని– జైళ్లలో నిర్బంధంలో ఉన్న తన పార్టీ కార్యకర్తలు, ఆప్తులను పలకరించి, ఓదార్చడానికి నిన్నటి వరకూ వెళ్లలేదంటే చంద్రబాబు గారికి పార్టీ కార్యకర్తలంటే ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో వెల్లడవుతోంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు గొడవలు, కేసులు, విచారణకు ముందు జైళ్లలో నిర్బంధాలు సర్వసాధారణం. డిటెన్షన్‌లో ఉన్న పార్టీ వారిని కలిసి ధైర్యం చెప్పడం అధినేత కనీస ధర్మం. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా అత్యధిక కాలం ఉన్నానని చెబుతున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త విలువలు, సాంప్రదాయాలకు ‘తెరలేపుతున్నారా?’ అనే అనుమానం వస్తోంది ఆయన చిత్తూరు ప్రసంగం చదివాక అని అనుమానం వ్యక్తపరిచారు.