నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో ఇక వర్షాలు తగ్గుతాయని అందరూ అనుకునే టైమ్‌లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రెండురోజులుగా ఒడిశా తీరం వైపు కదిలిన ఈ అల్పపీడనం.. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ తీరం వైపు మళ్లింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది.
ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. అలాగే ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు. సముద్రం వెంబడి ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. కాగా, ఇప్పటికే విశాఖతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు తెలంగాణలో పలు చోట్ల మోస్తరు వానలు పడుతున్నాయి.