కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐదు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశారు. ఈ ఐదింటిని 216 నేషనల్ హైవేపై నిర్మిస్తుండటం విశేషం. రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. అంతకుముందు రాజమండ్రి విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు, పలువురు ఎంపీలు, రాష్ట్ర అధికారులు, బీజేపీ నేతలు కేంద్ర మంత్రికి సాదర స్వాగతం పలికారు.
జాతీయ రహదారి నంబర్ 216 పై మోరంపూడి, జొన్నాడ జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, తేతాలి, కైకవరం వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. ఇందుకు దాదాపు రూ.3 వేల కోట్ల నిధులు కేటాయించారు. అలాగే, వాకలపూడి-ఉప్పాడ-అన్నవరం జాతీయ రహదారిపై లేనింగ్, సామర్లకోట-అచ్చంపేట జంక్షన్ హైవేపై 4 లేనింగ్, రంపచోడవరం నుంచి కొయ్యూరి వరకు జాతీయ రహదారిపై 2 లేన్ల నిర్మాణం పనులకు కూడా నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. గతంలో వచ్చినప్పుడు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదన్నారు. కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటం వల్ల విచారం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల వెంబడి పెద్ద మొత్తంలో మొక్కలు నాటి వాతావరణాన్ని కాలుష్యరహితంగా మార్చాలని పిలుపునిచ్చారు. చక్కెర ద్రావకం నుంచి బయో ఇంధనాన్ని తయారుచేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. అలాగే, మొలాసిస్, నూకల నుంచి బయోఇథనాల్ తయారుచేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 100 శాతం బయో ఇథనాల్‌తో వాహనాలు నడిపేలా చర్యలు తీసుకున్నప్పుడే కాలుష్యాన్ని పారదోలవచ్చునన్నారు. భవిష్యత్ అంతా హైడ్రోజన్‌తో నడిచే వాహనాలదే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ రవాణాశాఖ మంత్రి రామలింగేశ్వరరావు, ఎంపీలు భరత్‌రామ్, పిల్లి సుభాష్‌చంద్రబోస్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.