రోజూ ఓ గంట వ్యాయామం మంచిదే. కానీ, నిత్య జీవితంలో చురుకైన కదలికలతోనూ, భోజనంలో తగినన్ని పోషక విలువలతోనూ కొవ్వును వదిలించుకోవచ్చు. బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ పద్ధతినే 'నాన్-ఎక్సర్‌సైజ్ యాక్టివిటీ థర్మో జెనిసిస్’ (నీట్)గా వ్యవహరిస్తారు. అప్పుడప్పుడూ పుషప్స్, భోజనం తర్వాత కొద్దిపాటి నడక, మెట్లు ఎక్కడం, నిలబడి పనిచేసుకోవడం వంటివి.. ఆఫీసులోనూ సాధ్యమే. దీనివల్ల జీవక్రియ చాలా మెరుగవుతుంది. ఇంకా..సమయానికి నిద్రపోవడం, పొద్దున్నే మేల్కొనడం, సకాలంలో భోంచేయడం చాలా మంచిది. దీనివల్ల శరీర గడియారం సరిగ్గా సాగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.
సూర్యాస్తమయం అయిన ఓ గంటలోపు రాత్రి భోజనం ముగించాలి. ఇలా చేయగలిగితే జీవక్రియ మెరుగవుతుంది. సకాలంలో నిద్ర వస్తుంది. బరువు అదుపులో ఉంటుంది.
కొవ్వును, బరువును తగ్గించుకోవడానికి ఓ సులభమైన చిట్కా ఉంది.. తినేటప్పుడు ఆహారాన్ని బాగా నమిలి మింగడం. ఆ ప్రక్రియ ద్వారా పొదుపు చేసుకున్న శక్తిని కొవ్వును కరిగించడంలో ఉపయోగిస్తుంది మన శరీరం.
ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రొటీన్లు శరీర వ్యవస్థలోని లోటుపాట్లను సవరించి, కొవ్వును కరిగిస్తాయని నిపుణులు చెబుతారు.