జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద పండ్ల తోటలను పెంచుకొని అధిక లాభాలను పొందవచ్చని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ అన్నారు. శనివారం వీరబల్లి మండలం, మట్లి గ్రామ పంచాయతీ, వడ్డేపల్లిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సుబ్బమ్మ రైతు తన పొలంలో మామిడి మొక్కలు నాటే విధానాన్ని జిల్లా కలెక్టర్ గిరీషా క్షేత్రస్థాయిలో పరిశీలించి మామిడి మొక్కలను నాటారు.
అందులో భాగంగా రైతుకు ఎన్ని మొక్కలు ఇచ్చారు వంటి వివరాలను డ్వామా పిడిని జిల్లా కలెక్టర్ అడగగా 3. 78 ఎకరాల సెంట్ల భూమిలో సుబ్బమ్మ రైతుకు 265 మామిడి మొక్కలు ఇచ్చామని జిల్లా కలెక్టర్ కు వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన మామిడి పండ్ల తోటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని, మూడు సంవత్సరాలు బాగా కాపాడుకుంటే వాటి ద్వారా ప్రతి సంవత్సరం ఆదాయం పొందవచ్చునని రైతుకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఉద్యానవన పంటల పై రైతులకు మరింత అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైతులందరూ ప్రకృతి సేద్యం చేసేలా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం అందించే రాయితీ, పండ్ల తోటల పెంపకానికి మూడేళ్ల పాటు ఇచ్చే మెయింట్‌నెస్ చార్జీలను పొందాలని అన్నారు.