మహిళలు చట్టప్రకారం సురక్షితమైన అబార్షన్స్ చేయించుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్ చేయించుకోవచ్చని, అబార్షన్ చేయించుకునే హక్కు వారికి ఉందని చెప్పింది. గర్భం దాల్చిన 24 వారాల వరకు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్&రూల్స్ ప్రకారం ఒంటరి, అవివాహిత స్త్రీలకు అబార్షన్ చేయించుకునే హక్కుందని పేర్కొంది.
మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ''చట్టప్రకారం మహిళలందరికీ సురక్షితంగా గర్భస్రావం చేయించుకునే హక్కుంది. మహిళ వైవాహిక స్థితి కారణంగా ఆమెకు అవాంఛిత గర్భాన్ని తొలగించే హక్కు లేదని చెప్పలేం. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం నిబంధనల ప్రకారం పెళ్లయినా, కాకపోయినా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేయించుకునే హక్కుంది. ఈ విషయంలో వివాహితులు, అవివాహితులు అని వివక్ష చూపించడం నేరం.. రాజ్యంగం ఎదుట అది నిలవజాలదు. పెళ్లయిన వారిని 24 వారాల లోపు అబార్షన్‌కు అనుమతిస్తూ.. అవివాహితులను అనుమతించకపోవడం సరికాదు. ఇప్పుడు కాలం మారింది. చట్టం స్థిరంగా ఉండకూడదు. సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతుంటాయి'' అని కోర్టు స్పష్టం చేసింది.
వైవాహిక అత్యాచారం కూడా రేప్ వంటిదే..
విచారణ సందర్భంగా 'వైవాహిక అత్యాచారాల'ను సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ''అత్యాచారం అంటే సమ్మతి లేకుండా జరిగే కలయిక. చట్టపరమైన భాగస్వామి(భర్త)తోనూ లైంగిక వేధింపులు ఎదుర్కోవచ్చు. మహిళ సమ్మతి లేకుండా జరిగే కలయికతోనూ ఆమె బలవంతంగా గర్భం దాల్చొచ్చు. బలవంతంగా గర్భం దాల్చితే అది అత్యాచారం కిందే లెక్క. ఇలాంటి గర్భధారణల నుంచి మహిళలను కాపాడాల్సిన ఆవశ్యతక ఉంది'' అని ధర్మాసనం అభిప్రాయపడింది.