తింటున్నప్పుడు కొంచెం తీయగా, ఇంకొంచెం పుల్లగా ఉండే పైనాపిల్ అంటే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే వీటి వల్ల చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు పైనాపిల్‌లో పుష్కలంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. మనకు 'విటమిన్ సి' ఎంతో అవసరం. అయితే ఓ రోజుకు సరిపడా విటమిన్ సి ఒక కప్పు పైనాపిల్ నుంచి లభిస్తుంది. ఫలితంగా శరీరంలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. కణాల మరమ్మతుల్లోనూ, కణజాలాన్ని పునర్మించడంలో ఉపయోగపడే 'విటమిన్ సి' పైనాపిల్‌లో మనకు కావాల్సిన మోతాదులో లభిస్తుంది.
ఇక ఇందులో యాంటీ యాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతూ వృద్ధాప్యం దగ్గరకు రానీయకుండా కాపాడుతుంది. గుండె జబ్బులు, కేన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. ఇక వ్యాయామం చేసే వారు పైనాపిల్ తిన్నా, జ్యూస్‌ను తాగినా మరిన్ని అదనపు ప్రయోజనాలుంటాయి. వేగంగా బరువు తగ్గడంలో ఇది దోహదపడుతుంది. జీర్ణ వ్యవస్థ సమస్యలు రాకుండా పైనాపిల్ కాపాడుతుంది. కడుపునొప్పి, అజీర్తి వంటి వాటిని దరి చేరనీయదు. ఇందులో ఉండే బ్రొమెలనిన్ అనే ఎంజైమ్ ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు కృషి చేస్తుంది. మల బద్దకాన్ని ఇది దూరం చేస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలున్న పైనాపిల్‌ను రోజూ తీసుకుంటే చక్కటి ఆరోగ్యం సాధ్యపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.