భారత్ లో వెనుకబడిన ముస్లిం వర్గాల పరిస్థితులను మెరుగుపరిచేందుకు, మైనార్టీల హక్కుల కోసం పోరాడేందుకు 2006 లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. కేరళకు చెందిన నేషనల్ డెవలప్ ఫ్రంట్, తమిళనాడుకు చెందిన మనిద నీథి పాసారాయ్, కర్ణాటకకు చెందిన ఫోరం ఫర్ డిగ్నిటీలు విలీనమవుతూ పీఎఫ్ఐ గా ఏర్పడ్డాయి. కొద్దికాలానికే ఈ సంస్థ దేశమంతటా విస్తరించింది. ఆ తర్వాత దీని కింద చాలా అనుబంధ సంస్థలు ఏర్పడ్డాయి. అప్పట్లో కేరళతో పాటు కొన్ని రాష్ట్రాల్లో మతపరమైన హింసకు పీఎఫ్ఐ కార్యకలాపాలే కారణమనే ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో సీసీఏ నిరసనలు, కేరళలో లవ్ జిహాదీ వంటి ఘటనలతో ఈ సంస్థకి సంబంధం ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయి.
కేరళలో ఇటీవల జరిగిన ఆర్ఎస్ఎస్-బీజేపీ నేతల మర్డర్ కేసుల్లో పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థల సభ్యులు అరెస్ట్ అయ్యారు. పీఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను అందిస్తోందని, ఉగ్రవాద సంస్థల్లో చేరేలా యువతకు ట్రైనింగ్ ఇస్తోందనే ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా ఈ సంస్థ కార్యాలయాలపై ఎన్ఐఏ దాడులు చేసింది. ఇందుకు సంబంధించి కీలక విషయాలు, ఆధారాలు లభ్యమయ్యాయి. పీఎఫ్ఐ సంస్థ సభ్యుల ఇళ్లల్లో బాంబు తయారీ పత్రాలు, ఐసిస్ వీడియోలను కూడా ఎన్ఐఏ గుర్తించింది. ఇండియాను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే ఈ సంస్థ టార్గెట్ అని అధికారులు గుర్తించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది. తాజాగా పీఎఫ్ఐ ట్విట్టర్ అకౌంట్ ను కూడా నిలిపివేసింది.