అమెరికా అధ్యక్షుడికి అల్జీమర్స్ బాగా ముదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయన ప్రవర్తన తీరు కూడా తీవ్ర చర్చాంశనీయంగా మారింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బహిరంగ కార్యక్రమాల్లో పలుమార్లు వింత చేష్టలతో నవ్వులపాలవడం తెలిసిందే. ప్రసంగాల్లో వివిధ దేశాధినేతల పేర్లు మార్చేయడం, ఎవరూ లేకపోయినా గాల్లో షేక్ హ్యాండ్ ఇవ్వడం, వేదికపై ప్రసంగించాక ఎట్నుంచి కిందికి దిగాలో తెలియక వెర్రిచూపులతో నిలబడిపోవడం మీడియాకు కావాల్సినంత మేతను అందించింది. మరోపక్క, అమెరికా అధ్యక్షుడికి అల్జీమర్స్ బాగా ముదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వెల్లువెత్తాయి.
తాజాగా, ఇలాంటి ఘటనతో బైడెన్ మరోసారి తన మానసిక స్థితిపై చర్చకు అవకాశం ఇచ్చారు. ఆహార కొరత అంశంపై బుధవారం వైట్ హౌస్ లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు సందర్భంగా "జాకీ వాలోర్ స్కీ ఎక్కడ? జాకీ ఈ సమావేశానికి వచ్చావా నువ్వు?" అంటూ అడిగి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు.
జాకీ వాలోర్ స్కీ చట్టసభ సభ్యురాలు. గత ఆగస్టులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని మర్చిపోయిన బైడెన్... ఆహార కొరత సమావేశంలో జాకీ గురించి అడగడం విస్మయం కలిగించింది. దాంతో దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 79 ఏళ్ల వయసులో ఉన్న బైడెన్ కు అమెరికా అధ్యక్షుడికి ఉండాల్సినంత మానసిక సామర్థ్యం లేదని విమర్శలు చేస్తున్నారు.