జగన్ వైఖరి వల్లే ఏపీ పునర్విభజన చట్టం నీరుగారిపోతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందని, ఫలితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ కుటుంబ పాలనలు సాగుతున్నాయని ఆయన అన్నారు. కేసీఆర్ నాలుగేళ్లుగా జాతీయ పార్టీ, ఫ్రంట్ పేరుతో ఉవ్విళ్లూరుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల డబ్బు, నల్లధనంతో రాజకీయాలు చేయాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. కుటుంబ పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
బీజేపీ ఏపీ శాఖ చేపట్టిన ప్రజాపోరులో భాగంగా గురువారం తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. జగన్ విధానపరమైన నిర్ణయాలు ఏపీకి శాపంగా మారాయని ఆయన ఆరోపించారు. ఫలితంగా అభివృద్ధి లేని రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందిందన్నారు. 3 రాజధానులతో జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారన్న లక్ష్మణ్... రాజధానిని అటకెక్కించారని, అమరావతి రైతులపై కత్తి కట్టారని విమర్శించారు.