మంగళగిరి నగరంలో నిర్మితమైన 1728 టిడ్కో గృహాలను అక్టోబర్ నెల 10నుండి15వతేదీ మద్య లబ్ధిదారులకు అందజేయడం జరగుతుందని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. శనివారం టిడ్కో గృహాలను జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత గృహ సముదాయంలో జరుగుతున్న పనులన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి ఇంకా మిగిలి ఉన్న పనులను ఎప్పటిలోపు పూర్తి చేస్తారని అడిగితెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మొత్తం గృహాలు 1728 గాను అక్టోబర్ 2వ తేదీ నాటికి 300చ. గ ఉన్న 384 మంది లబ్ధిదారులకు ఇళ్లను ఇద్దామనుకున్నామని, కానీ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అధికారులు ఎంత శ్రమించినా కొన్ని పనులు మిగిలిపోయాయని అన్నారు. అందువలన అక్టోబర్ రెండు నాటికి గృహాలను అందించలేకపోతున్నామని చెప్పారు. మొత్తం ఉన్న 1728 మంది లబ్ధిదారులకు ఈనెల 10నుండి15 వ తేదీ మధ్యలో గృహానికి అందజేస్తామని అన్నారు.
కాంట్రాక్టర్లు అధికారులు మిగిలి ఉన్న పనులను ఆయా శాఖల సమన్వయంతో బార్ చాట్ ద్వారా ఈనెల 10 నాటికి పూర్తి చేస్తామని చెప్పారని అన్నారు. టిడ్కో, ఎలక్ట్రికల్, పబ్లిక్ హెల్త్ , కార్పొరేషన్, అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో పనులను వేగవంతంగా చేశారని వారికి ఎమ్మెల్యే ఆర్కే ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, కార్పోరేషన్ కమిషనర్ శారదా దేవి, వైకాపా పార్టీ చేనేత విభాగం అధ్యక్షులు గంజి చిరంజీవి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.