నిరుపేదల ఆపద్బాంధవుడు వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి అని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం స్థానిక వార్డు బొడ్డేపల్లిపేటలో జోరువానలోనూ వెనుకంజవేయకుండా జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హుషారుగా పాల్గొన్నారు. ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అన్నారు. మధ్యవర్తిత్వం, దళారీతనం లేని సంక్షేమాన్ని నేరుగా పేదలకు చేరవేయడంలో జగన్ రాజనీతిజ్ఞత అమోఘమని ప్రశంసించారు. సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు చేరువచేయడంలో లబ్దిదారులకు, ప్రభుత్వానికి అనుసంధాన వ్యవస్థగా గ్రామ, వార్డు సచివాలయం, వాలంటీర్లు వ్యవస్థను ఏర్పాటుచేసి, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందింపజేశారని గుర్తుచేశారు. కేవలం ఎన్నికల కోసమే వాగ్దానాలు, హామీలు గుప్పిస్తూ ప్రజలను మభ్యపెట్టే గత రాజకీయాలకు పాతరవేసి, సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు.
ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, రాజకీయ విమర్శలను సైతం ఎదుర్కొని మొక్కవోని దీక్షతో ముఖ్యమంత్రి భాధ్యతలు స్వీకరించిన రోజునుండి ఈరోజువరకు ప్రజలకు మేలు చేసేలా విప్లవాత్మక నిర్ణయాలతో, ముందుకు కొనసాగుతున్న వైనాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఇటువంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని విజ్ఞప్తి చేశారు. మున్ముందు సంక్షేమ పథకాలలో పేదలకు మరింత అండగా నిలవనున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, కమిషనరు ఎం. రవిసుధాకర్, ఏ. ఈ కె. అప్పలనాయుడు, టి. పి. ఎస్ హెచ్. వి సత్యనారాయణ, ఎలక్ట్రికల్, హౌసింగ్ ఏ. ఈ లు జి. రామారావు, డి. సన్యాసిరావు, నాయకులు ఎం. రమేష్, ప్రభాకరరావు, బి. రమేష్ కుమార్, పి. శ్రీనివాసరావు, డి. శ్యామలరావు, చిరంజీవి, బి. కోటేశ్వరరావు, బి. చంటి తదితరులు పాల్గొన్నారు.