నేటి (అక్టోబర్ 7) నుంచే పీకేఎల్ సీజన్ 9 ప్రారంభమవుతోంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ దబంగ్ ఢిల్లీ కేసీ, మాజీ ఛాంపియన్ యు ముంబాతో తలపడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. ఈ సీజన్ ఫ్యాన్స్‌కు మరింత ఆనందాన్ని పంచనుంది. ఎందుకంటే మూడు సీజన్ల తర్వాత తొలిసారి ప్రేక్షకులను మళ్లీ స్టేడియాలకు అనుమతిస్తున్నారు. కరోనా కారణంగా గత మూడు సీజన్లు అభిమానులు లేకుండా సాగింది. ఇక ఈ సారి బెంగళూరుతోపాటు హైదరాబాద్, పుణె కూడా ఈ లీగ్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ సీజన్ ఫస్ట్ లెగ్ మ్యాచ్‌లు బెంగళూరులో జరుగుతాయి.
ఈ సారి ప్రేక్షకులు తిరిగి స్టేడియాలకు వస్తుండటంపై పీకేఎల్ కమిషనర్, మాషల్ స్పోర్ట్స్ హెడ్ స్పోర్ట్స్ లీగ్స్ అనుపమ్ గోస్వామి స్పందించారు. "ఏ ఆటకైనా అభిమానులు, ప్రేక్షకులే బలం. వాళ్ల కోసం ఈసారి స్టేడియాల్లో కొత్త యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాం. ఫ్యాన్స్ లీగ్ చూసి ఆనందించడానికి అత్యున్నత నాణ్యత ఉన్న కాంపిటిషన్ అందించాలన్నదే మా లక్ష్యం. అందుకు తగినట్లు లీగ్ మోడల్‌లో మార్పులు చేస్తూ వెళ్తున్నాం" అని ఆయన చెప్పారు. పీకేఎల్ సీజన్ 9 తొలి రోజు మొత్తం మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. దబంగ్ ఢిల్లీ, యు ముంబా మ్యాచ్ తర్వాత తెలుగు టైటన్స్, బెంగళూరు బుల్స్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఇక మూడో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్, యూపీ యోధాస్ తలపడనున్నాయి.
ఈ సారి ప్రొ కబడ్డీ లీగ్ అక్టోబర్ 7 నుంచి నవంబర్ 8 వరకూ జరగనుంది. తొలి మూడు రోజులూ మూడేసి మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్‌లో ఈ సారి టైటిల్ కోసం పోటీ పడుతున్న మొత్తం 12 జట్లలో.. తెలుగు టైటాన్స్, యు ముంబా, దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ ఫాంథర్స్, యూపీ యోధాస్, హర్యానా స్టీలర్స్, పూణేరి ఫల్టాన్, తమిళ్ తలైవాస్, గుజరాత్ జెయింట్స్, బెంగాళ్ వారియర్స్, బెంగళూరు బుల్స్, పాట్నా పైరెట్స్ ఉన్నాయి. ఇక ఈ సీజన్ మొత్తం శుక్ర, శనివారాల్లో మూడేసి మ్యాచ్‌లు ఉంటాయి. ఈ సారి పీకేఎల్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీల్లో చూడొచ్చు. మూడు మ్యాచ్‌లు ఉన్న రోజుల్లో తొలి మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండో మ్యాచ్ 8.30 గంటలకు, మూడో మ్యాచ్ 9.30 గంటలకు ప్రారంభమవుతాయి.