ఇటీవల కాలంలో ఆ దేశంలో వరసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారం నేపాల్ లోని బారా జిల్లాలోని బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది చనిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. నేపాల్ లోని మాధేష్ ప్రావిన్సులో ఈ ఘటన జరిగింది. మరో 35 మంది గాయపడ్డారు. వీరిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నారాయణ గఢ్ నుంచి బిర్‌గంజ్ వెళ్తున్న బస్సు.. అదుపు తప్పి నదిలో పడిపోయింది. అతివేగం వెళ్లడమే ప్రమాదానికి కారణం అని నేపా్ పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వ్యక్తులను వైద్య చికిత్స కోసం హెటౌడా, చురే హిల్, సాంచో ఆస్పత్రులకు తరలించారు.
అక్టోబర్ 2న ఈస్ట్ వెస్ట్ హైవేపై ఇలాగా బస్సు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఇద్దరు మరణించగా.. 36 మంది గాయపడ్డారు. నేపాల్ దేశం పూర్తిగా హిమాలయాలతో నిండి ఉంటుంది. దీంతో ఘాట్ రోడ్డులే అధికంగా ఉంటాయి. ఏ మాత్రం పట్టుతప్పిన వాహనాలు నదులు, లోయల్లో పడిపోతుంటాయి. ఇరుకుగా ఉండే రోడ్లు దీనికి తోడు అక్కడ రోడ్డు వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా ఉండటం కూడా ప్రమాదాల తీవ్రతను పెంచుతున్నాయి. తాజాగా జరిగిన ఈ ప్రమాదం ఈ కోవలోకే వస్తుంది.