ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎపి రైతుసంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం తాడిపత్రి మండల పరిధిలోని పెద్దపడమల, చిన్న పడమల గ్రామాల్లో రైతుసంఘం నాయకులు పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల కార్యదర్శి రాజారామిరెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, సన్‌ప్లవర్ తదితర పంటలు వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అదేవిధంగా పత్తి పంట నీట మునిగి నాశనమైందన్నారు. ఫలితంగా అప్పులు చేసి సాగు చేసిన రైతులు దిగాలు పడ్డారన్నారు. ఒక ఎకరాకు దాదాపు రూ. 30 నుంచి రూ. 35 వేల వరకు ఖర్చు అయిందన్నారు. మండల పరిధిలోని ఎగువపల్లి, దిగువపల్లి, కొనగుంటపల్లి, చల్లవారిపల్లి, ఆలూరు ఊరుచింతల, తలారి చెరువు, బోడాయిపల్లి, యలమకురు తదితర గ్రామాల్లో సాగు చేసిన పత్తి, సోయాచికుడు, వరి, సన్‌ఫ్ల్లవర్ తదితర పంటలు అధిక తేమ వల్ల పూర్తిగా నాశనమయ్యాయన్నారు. కావున అధికారులు స్పందించి క్షేత్రస్థాయికి వెళ్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనా వేసి తగిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. అదేవిధంగా ఎకరాకు రూ. 40వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారిణి మహిత కిరణ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యులు శిరీషా, మండల కమిటీ సభ్యులు సరళ, బాల నరసింహారెడ్డి, నారాయణరెడ్డి, జయశేఖర్‌రెడ్డి, వెంకటేష్, లక్ష్మీరెడ్డి, నాగచంద్ర, రమాదేవి ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.