సమాచార హక్కు చట్టం దరఖాస్తుల పరిశీలన, నిర్దిష్ట గడువులోగా పరిష్కారానికి ప్రతి అధికారి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు 'సమాచార హక్కు చట్టం -2005 వారోత్సవాలు సందర్భంగా సమాచార హక్కు చట్టం అమలు తీరుపై కలెక్టర్ అధ్యక్షతన వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సమాచార హక్కు చట్టం పక్కాగా అమలు చేయాలని, దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని ఆర్టీఐ నిబంధనల మేరకు నిర్దిష్ట గడువులోగా అందించాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు, ప్రభుత్వ కార్యకలాపాల సమాచారాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టం ఏర్పడిందన్నారు.
ప్రజాధనంతో చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వివరాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, ఈ విషయాలపై అడిగే సమాచారాన్ని జాప్యం లేకుండా అందించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్షన్ 4(1బి)లో పొందుపరిచిన 17 అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. ముఖ్యంగా కార్యాలయాల ముందు పౌర సమాచార అధికారి పేరు, అప్పిలేట్ అధికారి పేరు, ఫోన్ నెంబర్లు, అందిస్తున్న సేవలకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుపుతూ సమాచార హక్కు చట్టం బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రతి నెలా మూడో శుక్రవారం సమీక్ష జరపాలన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఆర్టీఐ చట్టాన్ని సరైన మార్గంలో వినియోగించు కుంటే సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. గ అనంతరం ఆర్టిఐ దరఖాస్తుదారులు, పౌర సమాచార అధికారులు తెలిపిన సందేహాలను డీఅర్వో నివృత్తి చేశారు. జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు తీరును వివరించారు. ఈ వర్క్ షాప్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ కె. ఎస్. విశ్వనాథన్ పెందుర్తి మండలం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ మండలాల ఎమ్మార్వో లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.