కోనసీమ జిల్లా జాల్లర్లకు చేపల వేట ఎంతో కలసివచ్చింది. ఇదిలావుంటే ఇది పులస చేపల కాలం. తమ వలలో ఒక్క పులస పడినా చాలని జాలర్లు కోరుకుంటారు. గోదావరి నదిలో దొరికే అత్యంత అరుదైన చేప ఇది. నదికి ఎదురీదుతూ వచ్చే ఈ పులస చేప రుచే రుచి. అత్యంత అరుదుగా లభించే ఈ పులస చేప ధర నిజం చెప్పాలంటే బంగారంతో పోటీపడుతుంది. అందుకనే పులస దొరికితే జాలర్లకు ఆ రోజు పంట పడినట్టే. అంతేకాదు, ధరతో సంబంధం లేకుండా జనం కూడా దానిని చేజిక్కించుకునేందుకు పోటీ పడుతూ ఉంటారు.
పుస్తెలు అమ్మైనా సరే పులస తినాలని అంటారు. పులస టేస్ట్ అంతలా ఉంటుంది మరి. ఇవి కిలో రూ. 10 వేల నుంచి ప్రారంభమవుతాయి. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం కేదార్లంక వద్ద గోదావరిలో ఓ మత్స్యకారుడు సందాడి సత్యనారాయణ వలలో పులస చేప పడింది. కిలో బరువున్న ఈ పులసను పెదపట్నం లంకకు చెందిన నల్లి రాంప్రసాద్ రూ. 17 వేలకు కొనుగోలు చేశారు.