ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. నరసాపురం డిపోకు చెందిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఏలూరు వెళ్తుండగా దాని చక్రాలు ఒక్కసారిగా ఊడి బయటకు వచ్చాయి. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సును ఆపిన వెంటనే వారంతా బతుకు జీవుడా అనుకుంటూ కిందకు దిగారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బస్సు జాతీయ రహదారి మీదుగా ఏలూరు వెళ్తుండగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరు వద్ద బస్సు వెనక భాగంలో ఓ వైపున ఉన్న రెండు చక్రాలు ఊడి బయటకు వచ్చాయి. దీంతో భారీ శబ్దంతో బస్సు ఓ వైపునకు ఒరిగిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బస్సును ఆపేసిన డ్రైవర్ డిపో అధికారులకు సమాచారం అందించాడు. అనంతరం అందులోని ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు పంపారు.