ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి ఆయా జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే ఆస్ట్రేలియా పరిస్థితులకు అలవాటు పడాలని టీమ్ ఇండియా ప్రయత్నిస్తోంది. 15 ఏళ్లుగా అంతుచిక్కని టీ20 ప్రపంచకప్‌ను గెలవాలనే పట్టుదలతో ఉన్న రోహిత్ సేన ఈ నెల 23న బరిలోకి దిగనుంది. క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఇక భారత్‌లో ఈ ఆటను మతంలా ఆరాధిస్తారు. అందుకే ప్రముఖ కంపెనీలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడతాయి. క్రికెట్ మ్యాచ్‌ల పేరిట ఆఫర్లు ప్రకటిస్తాయి. అధికారిక బ్రాడ్ కాస్టర్లు సైతం ప్రపంచకప్ మ్యాచ్ రైట్స్ కోసం కోట్లు కుమ్మరించాయి. ఇక ఈ క్రికెట్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ ఐనాక్స్ ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్లు కలిగివున్న ఐనాక్స్.. థియేటర్ బిగ్ స్క్రీన్లలో ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఐసీసీతో, ఐనాక్స్ ఒప్పందం కుదుర్చుకోనుంది.
భారత్‌లోని 25 ఐనాక్స్ థియేటర్లలో ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఐనాక్స్ లీజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ విశాల్ ప్రకటించారు. "భారత క్రికెట్ ప్రేమికులకు పెద్ద స్క్రీన్‌పై క్రికెట్‌ను వీక్షించడం మరియు దాని సౌండ్ ఎఫెక్ట్‌లను భారీ స్థాయిలో అనుభవించడం వంటి ఆనందాన్ని అందించాలని INOX నిర్ణయించింది. అలాగే, ప్రపంచ కప్ టోర్నమెంట్ సమయంలో పెద్ద స్క్రీన్‌పై క్రికెట్‌ను చూసే అవకాశం క్రికెట్‌ను ఆస్వాదించేలా చేస్తుంది. థియేటర్ మరింత ఆనందదాయకంగా ఉంటుంది’’ అన్నారు. INOX భారతదేశంలోని మొత్తం 74 నగరాల్లో మల్టీప్లెక్స్ థియేటర్‌లను కలిగి ఉంది. ఐనాక్స్‌కు బెంగళూరుతో సహా దేశంలోని 74 నగరాల్లో 165 మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. వాటికి మొత్తం 705 స్క్రీన్లు ఉన్నాయి. మొత్తం 1.57 లక్షల మంది ఈ క్రికెట్ మ్యాచ్‌లను ఏకకాలంలో వీక్షించవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో, ఐనాక్స్ మరో మల్టీప్లెక్స్ దిగ్గజం PVRతో విలీనాన్ని ప్రకటించింది. థియేటర్‌లోని బిగ్‌స్క్రీన్‌పై మ్యాచ్‌లు చూస్తుంటే.. క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు చూసిన అనుభూతి కలుగుతుందని ఐనాక్స్ కంపెనీ తెలిపింది. మ్యాచ్ చూసేందుకు టిక్కెట్ ధర నగరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని చెబుతున్నారు.