కీళ్ల నొప్పులు స్త్రీలలో అధికమని అయితే తొలి దశలనే గుర్తిస్తే మందులతో పూర్తిగా నియంత్రించవచ్చని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జన్యుపరమైన కారణాల వలన ఈ వ్యాధి వస్తుంది అని అన్నారు. కీళ్ల లో నొప్పి లేదా వాపు, చర్మంపై ఎర్రటి మచ్చలు, ఎక్కువగా జుట్టు రాలడం, దీర్ఘకాలిక జ్వరం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, రక్త కణాలు తగ్గడం, కండరాల బలహీనత వ్యాధి లక్షణాలు అన్నారు. దీని నివారణకు గాను పౌష్టికాహారం తీసుకోవాలని , క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఒత్తిడిని అధిగమించాలని డాక్టర్ కుమార్ యాదవ్ తెలిపారు. అనంతరం వైద్య పరీక్ష లు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.