అదానీ గ్రూప్ పూర్తి స్థాయి టెలికాం సేవల రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ అదానీ డేటా నెట్‌వర్క్స్‌కు లైసెన్సు మంజూరు చేసినట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఈ లైసెన్సుతో అదానీ గ్రూప్ పూర్తి స్థాయిలో అన్ని రకాల టెలికాం సేవలు అందించేందుకు వీలవుతుంది. ఇటీవల జరిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో అదానీ గ్రూప్ తన అనుబంధ కంపెనీ అయిన అదానీ డేటా నెట్‌వర్క్స్ ద్వారా కొంత స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది. డేటా కేంద్రాల కోసమే ఈ కొనుగోలు అని అదానీ గ్రూప్ అప్పట్లో ప్రకటించింది. అయితే ఇప్పుడు సైలెంట్‌గా పూర్తి స్థాయి టెలికాం సేవల కోసం లైసెన్సు పొందడం విశేషం. అయితే, జియో, ఎయిర్‌టెల్ లకు పోటీగా తమ టెలికాం నెట్‌వర్క్‌ను పరిచయం చేసే విషయంపై అదానీ గ్రూప్ ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. అదే నిజమైతే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంపెనీలకు గట్టి పోటీ తప్పక పోవచ్చు.