దేశం కోసం యువత పనిచేయాలని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు జిల్లాలోని యువతకు పిలుపునిచ్చారు. దేశం మనకు ఏమిచ్చిందని కాకుండా దేశానికి మనం ఏమిచ్చామని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు. బుధవారం మునసాబుపేటలోని గురజాడ విద్యా సంస్థలో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో నెహ్రు యువ కేంద్రం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ యువతకు సామాజిక స్పృహ, బాధ్యతతో పనిచేయాలని కోరారు. స్వామి వివేకానంద ఆశయాలు, స్ఫూర్తికి అనుగుణంగా పనిచేసిననాడే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆద్యంతం తిలకించారు.