యోగి వేమన విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్ (పీజీడీపీఆర్), పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ తెలుగు జర్నలిజం (పీజీడీటీజే) కోర్సుల నిర్వహణకు అనుమతి లభించింది. ముద్రణ, దృశ్య శ్రవణ మాధ్యమాలలో, ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలలో ప్రజా సంబంధాల అధికారులు, మీడియా కన్సల్టెంట్ లుగా చేరేందుకు విద్యార్థులకు పీజీ డిప్లమో సర్టిఫికెట్ ఉపయోగం ఉంటుంది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య మునగల సూర్య కళావతి, కులసచివులు ఆచార్య దుర్భాక విజయరాఘవ ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చారని వైవీయు జర్నలిజం అండ్ కమ్యునికేషన్ శాఖ సమన్వయకర్త డా. తమ్మినేని శ్యామ్ స్వరూప్ తెలిపారు.
2022- 23 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నామని తెలిపారు. ఏడాది కాలవ్యవధి, రెండు సెమిస్టర్లు కలిగిన డిప్లమా కోర్సులలో ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ప్రవేశం పొందగోరే అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి లేదు. ప్రతి కోర్సులోనూ సీట్లు 50 కి పరిమితం చేశారు. కోర్సు రుసుము రూ. 6000 గా నిర్ణయించామన్నారు. రెండు డిప్లమా కోర్సులకు ప్రవేశాల నోటిఫికేషన్ యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రవేశాల సంచాలకులు ఆచార్య కె. గంగయ్య కార్యాలయం నుంచి త్వరలోనే వెలుపడుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు 9848375467, 8008006630 సెల్ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.