ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోనెగండ్ల, దేవనకొండల, ఆస్పరి, హాలహర్వి మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని గాజుల దిన్నె ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ జలాశయానికి 20వేల క్యూసెక్కుల నీరు వస్తుందని అధికారులు వెల్లడించారు.
ప్రాజెక్టు 4గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ముందుజాగ్రతగా గోరెగండ, కోడుమూరు మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆలూరు మండలంలో కుండపోతగా వర్షం పడడంతో హత్తిబెలగళ్ నుంచి అర్థగేరికి వెళ్లే రహదారి తెగిపోయింది. ఆదోని పట్టణం పరిషమల్లలో వర్షానికి ఇల్లు కూలి ఫారిద్ సహీద్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. జిల్లాలోని నడిమివంక వాగు ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో నడిమివంక పరివాహక ప్రాంతాల్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు వెయ్యిమందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. రాయదుర్గంలో ఇళ్లలోకి పెద్ద చేపలు కొట్టుకువచ్చాయి. వరద ప్రవాహానికి కారు, ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. కణేకల్ రోడ్డులో భారీ వృక్షం నేల వాలింది.