సూపర్ సైక్లోన్ ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని వైసిపి ప్రభుత్వానికి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచించారు. వచ్చే వారంలో ఏపీకి సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ చెబుతోందని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజలను నీట ముంచి, ఆ తర్వాత ప్రభుత్వం హడావుడి చేయడం కాదు... ముందే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను వరదలకు వదిలేయకుండా, ముందుగానే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయండి అని సలహా ఇచ్చారు.
ఈ మూడున్నరేళ్లలో రాయలసీమలో వరదలకు, గోదావరి వరదలకు ప్రభుత్వం ఎంత అలసత్వంగా ఉందో అంతా చూశామని అన్నారు. విపత్తుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ, విపత్తు తర్వాత బాధితులకు సాయం అందించడంలోనూ ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు శాపంగా మారుతుందని చంద్రబాబు తెలిపారు.
గతంలో ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని వివరించారు. ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం సహజ అలసత్వాన్ని వీడి, విపత్తు నష్టాలను, కష్టాలను తగ్గించడానికి సిద్ధమవ్వాలని స్పష్టం చేశారు. స్వచ్ఛంద సంస్థలు, టీడీపీ వర్గాలు కూడా తుపానుపై అవసరాన్ని బట్టి స్పందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.