అమరావతి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు చేసేది రియలెస్టేట్ పోరాటమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబుకు 29 గ్రామాల అభివృద్ధే కావాలని చెప్పారు. తాము మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నామని... తాము చేస్తున్నది ప్రజా పోరాటమని అన్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే జగనన్న సంకల్పమని చెప్పారు. జగన్ సంకల్పానికి ఉత్తరాంధ్ర ప్రజలంతా సంఘీభావం తెలపాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించాలని అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా రోజా విమర్శలు గుప్పించారు. షూటింగులకు, కలెక్షన్ల కోసం, ఎన్నికల్లో పోటీ చేయడం కోసం పవన్ కు విశాఖ కావాలని... కానీ విశాఖ రాజధానిగా మాత్రం వద్దని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుందో పవన్ కు చూపించాలని... ఆయనను తరిమికొట్టాలని అన్నారు.