మన దేశంలో అమూల్ పాల ధరలు మరోమారు పెరిగాయి. కానీ ఓ ఒక్క గుజరాత్ రాష్ట్రానికి మాత్రం ఈ పెంపుదల వర్తించలేదు. ఇప్పటికే ఈ ఏడాదిలో రెండు సార్లు అమూల్ పాల ధరలు పెరగగా.. తాజాగా మూడో దఫా కూడా అమూల్ పాల ధరలను పెంచుతూ ఆ బ్రాండ్ యాజమాన్య సంస్థ గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ సొసైటీ శనివారం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా అమూల్ పాల ధరలను ఎప్పుడు పెంచినా ముందుగానే ప్రకటన విడుదల చేస్తూ వచ్చిన అమూల్..ఈ దఫా మాత్రం పాల ధరలను పెంచిన తర్వాత ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
మరోవైపు అమూల్ పాల ధరలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెంచుతున్నట్లు ప్రకటించిన అమూల్... తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో మాత్రం ధరలను పెంచలేదు. గుజరాత్ మినహా దేశవ్యాప్తంగా పాల ధరలను పెంచుతున్నట్లు అమూల్ ప్రకటించింది. ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాలపై లీటరుకు రూ.2 ధరను పెంచింది. శుక్రవారం దాకా ఈ మిల్క్ ధర మార్కెట్‌లో రూ.61 ఉండగా... శనివారం నుంచి ఈ ధర రూ.63కు పెరిగింది. అంతేకాకుండా ఒకే ఏడాదిలో అమూల్ తన పాల ధరలను లీటరుకు ఏకంగా రూ.6 మేర పెంచడం గమనార్హం.