పరవాడ ఊర చెరువు కాలుష్యానికి కారణమైన రాంకీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కి సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఫార్మా పరిశ్రమల నుండి విడుదల అవుతున్న వ్యర్థ రసాయనాలను శుద్ధి చేయకుండా పైపులైన్ల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా యాజమాన్యం సమీపంలో ఉన్న సాగు నీటి చెరువుల్లోకి విడిచిపెడుతున్నారని అందులో పేర్కొన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు నాశనమై పంటలు పండక రైతులు దివాలా తీస్తున్నారన్నారు. కాలుష్యంతో చుట్టూ ఉన్న పరవాడ, తానం, తాడి, లంకెలపాలెం, సాలాపువానిపాలెం తదితర గ్రామాలు కాలుష్యంలో అల్లాడుతున్నారని అన్నారు. ఫార్మా పరిశ్రమల నుండి విడుదలవుతున్న వ్యర్థ రసాయనాలను శుద్ధిచేసి సముద్రంలోకి పంపించవలసిన యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘన చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపించి రాంకీ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని గనిశెట్టి వినతి పత్రం ద్వారా కోరారు.