వైసీపీ ప్రభుత్వం పోలీసుల్ని అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ ఉద్యమాలను ఆపాలని చూస్తున్నారని, మాజీ శాసనమండలి సభ్యులు, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు జగన్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవాణి కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని అనుమతులు తీసుకొని విశాఖకు వచ్చారని తెలిపారు. నోవాటెల్ హోటల్ లో బస చేసినఆయన దగ్గరికి వెళ్లి సోదాలు చేయడం, నాయకులను, కార్యకర్తలను బెదిరించి ఉద్యమాన్ని ఆపాలని అనుకోవడం నియంత పాలనకు పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. విశాఖ పోలీసులు రూల్ 30 ప్రకారం సభలు సమావేశాలు ఊరేగింపులు జరపకూడదని ఆంక్షలు విధించిన పోలీస్ అధికారులు విశాఖలో అక్టోబర్ 15న అధికార పార్టీ తలపెట్టిన విశాఖ గర్జనకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారో ప్రకటన చేయాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ను ప్రజలకు కనపడకుండా కారులోనే వెళ్లాలని పోలీస్ అధికారులు ఏ అధికారంతో రాజకీయాలకు నిబంధన పెడుతున్నారని ఇది ముమ్మాటికి ఎమర్జెన్సీ రోజులు తలపించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. గతంలో విశాఖపట్నం ప్రశాంతత వాతావరణంతో ప్రజలు జీవన ప్రమాణాలు ఉండేవని వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దోపిడీలు, దొంగతనాలు హత్యలు, నిత్య కృత్యం అయిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో క్రైమ్ రేటు పెరిగిపోయాయని 76 హత్యలు జరిగాయని హంతకులు పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు ఒక పార్టీకి వత్తాసుగా పలుకుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో కోట్ని రామకృష్ణ, కుప్పిలి జగన్, మల్ల శివన్నారాయణ, విల్లూరి రమణబాబు లు పాల్గొన్నారు.