రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి మంగళగిరి నగరంలో అపూర్వ స్పందన లభిస్తోంది. సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళ్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సోమవారం నగరంలోని 20వ సచివాలయం పరిధి ఎయిమ్స్ గేటు సమీపంలోని పత్తిమిల్లు వద్ద నుండి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే గడపగడపకు వెళుతూ ప్రజలతో మమేకమై వారిని అక్కా బాగున్నావా. అన్నా బాగున్నావా. అవ్వా, తాతా… మీకు పెన్షన్ అందుతుందా. అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ, ఆ సమస్యలను అప్పటికప్పుడే అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. కొంతమంది అవ్వా తాతలు జగన్ ప్రభుత్వం పై దీవెనలు కురిపిస్తూ చల్లగా ఉండాలని. మళ్లీ మీరే మంగళగిరి లో ఎమ్మెల్యే గా గెలవాలని ఎమ్మెల్యే ఆర్కేను ఆశీర్వదించారు.