రోడ్ల పరిస్థితిపై కేంద్ర మంత్రి ట్విట్ వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అన్నారు. జగన్ పాలన ఎలా ఉందో కేంద్ర మంత్రులు సైతం గుర్తించారని ఆయన చెప్పారు. అయితే జగన్ ప్రభుత్వంలోని ఉత్తమ పాలసీలు చూసో, బెస్ట్ రిజల్ట్స్ చూసో కాదని... మూడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజలకు నరకం చూపుతున్న రోడ్లను చూసి అని ఎద్దేవా చేశారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ ఏపీ రోడ్ల దుస్థితిపై చేసిన ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేశారు.
తన ట్వీట్ లో ఏపీ ప్రభుత్వంపై మురళీధరన్ విమర్శలు గుప్పించారు. 'అనకాపల్లిలోని రోడ్ల దుస్థితిని చూడండి. వైయస్ జగన్ అభివృద్ధి మోడల్ అంటే ఇదేనా? ఈ రోడ్లపై ప్రయాణించడం ఒక శిక్షలాంటిది. ప్రజల ప్రాథమిక అవసరాలను కూడా జగన్ పట్టించుకోవడం లేదు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురంకు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటకు పైగా సమయం పట్టింది. షేమ్' అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసిన చంద్రబాబు... వైసీపీ ప్రభుత్వానికి ఇది సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రోడ్ల మరమ్మతులపై ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ... ప్రజలు మాత్రం రోడ్డు దాటలేకపోతున్నారని విమర్శించారు.