పెళ్లి సమయంలో ఓ పెళ్లికూతురు పెట్టిన నిబంధన చివరకు ఆ దంపతులకు వరంగా మారింది. అసోంకు చెందిన భార్యాభర్తలైన ఓ జంటకు పిజ్జాహట్ కంపెనీ నెలకో పిజ్జా ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. కర్వాఛౌత్ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఈ ప్రకటన చేసింది. ఏడాది పాటు తమ బ్రాంచిలలో నెలకు ఒక పిజ్జా తీసుకోవచ్చని తెలిపింది. ఈ అస్సామీ జంటకు ఈ ఏడాది జూన్ లో పెళ్లయింది. భార్య పేరు మింటూ రాయ్ కాగా, భర్త పేరు శాంతి ప్రసాద్.
దాంపత్య జీవనంలో ఎవరు ఎలా ఉండాలనే విషయంపై పెళ్లి వేదికపైనే వాళ్లు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. షరతులతో కూడిన పేపర్ పై ఇద్దరూ సంతకాలు చేశారు. అందులో నెలకు ఒక పిజ్జా తినిపించాలనే షరతు కూడా ఉంది. ఈ షరతు నెరవేర్చడంలో ఆ భర్తకు తమ కంపెనీ సాయం చేస్తుందని పిజ్జా హట్ ప్రకటించింది.
భర్తకు పలు షరతులు విధించిందా భార్య.. వారానికి ఒక సినిమా, పదిహేను రోజులకు ఒకసారి షాపింగ్, నెలకు ఒక పిజ్జా.. ఇలాంటి సరదా షరతులను దంపతులు చాలానే విధించుకున్నారు. పెళ్లి వేదికపైన స్నేహితులు, బంధువుల మధ్య షరతుల పత్రంపై సంతకాలు చేయడం అప్పట్లో వైరల్ గా మారింది. ఆ జంట కొంతకాలం సోషల్ మీడియాలో సెలబ్రిటీల హోదా అనుభవించారు.