దేశంలోని అన్ని నగర గ్రామాలలో 5జి సేవలు అందుబాటులోకి రావాలంటే మరో రెండేళ్లు వేచి చూడక తప్పదని సమాచారం. ఇదిలా ఉంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన 5జీ సేవలు మన దేశంలో ఈ నెల ఆరంబంలో ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ తో పాటు ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్‌నగర్, కోల్‌కతా, చెన్నై, లక్నో, పూణే, ఢిల్లీ నగరాల్లో 5జీ సేవలు వినియోగదారుకు అందుబాటులో ఉంచుతామని టెలికమ్యూనికేషన్స్ విభాగం ప్రకటించింది.
అయితే, ప్రభుత్వం పేర్కొన్న అన్ని నగరాలకు ప్రస్తుతం కనెక్టివిటీ లభించడం లేదు. ప్రస్తుతానికి ఎయిర్‌టెల్, జియో మాత్రమే ఎంపిక చేసిన ప్రదేశాలలో 5జీ సేవలు అందిస్తున్నాయి. జియో ముంబై, ఢిల్లీ, వారణాసి, కోల్‌కతా నాలుగు నగరాల్లో దసరా నుంచి 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ తన 5జీ ప్లస్‌ను ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్ వారణాసిలో అందిస్తోంది. జియో, ఎయిర్ టెల్ 5జీ నెట్‌వర్క్‌ను ఆయా నగరాల్లో దశలవారీగా అమలు చేస్తున్నాయి. ఈ లెక్కన వినియోగదారులంతా పూర్తిగా 5జీ సేవలను పొందడం లేదని అర్థం అవుతోంది.
మరో ప్రధాన కంపెనీ వీఐ (వొడాఫోన్ ఐడియా) ఇంకా తమ 5జీ సేవల ప్రారంభ తేదీని ప్రకటించలేదు. వచ్చే నెలలో సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. భారత టెలీ కమ్యూనికేషన్స్ ప్రకారం 5జీ కనెక్టివిటీ దేశం మొత్తంలో రెండు, మూడేళ్లలో సరసమైన ధరల్లో అందుబాటులోకి రానుంది. రిలయన్స్ జియో వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేశం అంతటా తమ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్టెల్ కూడా ఈ ఏడాది చివరి నాటికి కీలకమైన మెట్రో నగరాల్లో 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో దేశం అంతటా ప్రారంభించాలని చూస్తోంది. 4జీ కనెక్టివిటీ సిమ్ ఉన్న వినియోగదారులు 5 కనెక్టివిటీ కోసం కొత్త సిమ్ కొనుగోలు చేయనవసరం లేదని జియో, ఎయిర్ టెల్ ప్రకటించాయి. 5జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లు ఆటోమేటిక్‌గా 5జీ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతాయి.