ఇటీవల పలు మార్పులకు శ్రీకారం చుట్టిన వాట్సాప్ తాజాగా పలు నూతన ఫీచర్లను, ప్రయోజనకర ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. సమాచార వేదిక వాట్సాప్.. త్వరలోనే పలు కొత్త ఫీచర్లను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. వీటిల్లో కొన్ని ఆసక్తికరమైనవి ఉన్నాయి.
ఎడిట్
పంపించిన సందేశాలను నిర్ణీత సమయంలోపు ఎడిట్ చేసుకోవడానికి అనుమతించనుంది. పంపించిన 15 నిమిషాల వరకు ఇందుకు గడువు ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది.
గ్రూపు సభ్యుల సంఖ్య
ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులో గరిష్ఠంగా 512 మంది సభ్యులుగా ఉండొచ్చు. త్వరలో దీన్ని రెట్టింపు చేయనుంది. దీంతో ఒకే గ్రూపులో 1024 మంది సభ్యులుగా చేరొచ్చు.
డాక్యుమెంట్ల షేరింగ్ కు క్యాప్షన్
ఇప్పటి వరకు వాట్సాప్ లో మనం ఇమేజ్ , వీడియోలు పంపిస్తుంటే క్యాప్షన్ అడుగుతుంది. కానీ, డాక్యుమెంట్లకు మాత్రం క్యాప్షన్ అడగదు. ఇకమీదట డాక్యుమెంట్లకూ క్యాప్షన్ ఇవ్వొచ్చు.
స్క్రీన్ షాట్
ఒకరు పంపించిన సందేశాలను గుర్తు పెట్టుకోవడానికో, లేదంటే ఆధారం కోసమో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. కానీ, స్క్రీన్ షాట్ తీసుకోవడం త్వరలో సాధ్యపడకపోవచ్చు. యూజర్ల గోప్యత పరిరక్షణలో భాగంగా వాట్సాప్ దీనికి త్వరలోనే చెక్ పెట్టనుంది. ఒకరు తమ సందేశాలను స్క్రీన్ షాట్ తీసుకోకుండా ఉండాలంటే, పంపించే వారు వ్యూ వన్స్ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది.
ప్రీమియం సబ్ స్క్రిప్షన్
వ్యాపారుల వాట్సాప్ వినియోగం పెరుగుతోంది. చెల్లింపులు, ఆర్డర్ల స్వీకరణ, సమాచార, ప్రత్యుత్తరాలు, ఆఫర్లు ఇలా ఎన్నో రకాల సమాచారాన్ని కస్టమర్లతో పంచుకునేందుకు కంపెనీలు వాట్సాప్ ను ఉపయోగిస్తున్నాయి. ఇక మీదట వ్యాపార సేవల కోసం ప్రీమియం సబ్ స్క్రిప్షన్ సేవలను వాట్సాప్ అందించనుంది.