పత్రికా స్వేచ్ఛకు మద్దతు ఇవ్వడంపై తాము కట్టుబడి ఉన్నామని అమెరికా వెల్లడించింది. జమ్మూ కశ్మీర్ కు చెందిన మహిళా ఫొటో జర్నలిస్టు సనా మట్టూ ప్రఖ్యాత పులిట్జర్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే, ఈ విశిష్ట అవార్డును అందుకునేందుకు అమెరికా వెళుతుండగా తనను ఢిల్లీ ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నట్టు సనా మట్టూ ఆరోపించారు. దీనిపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. సనా మట్టూ అమెరికా వచ్చేందుకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆటంకాలు ఎదురవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ వెల్లడించారు. ఈ పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
పత్రికా స్వేచ్ఛకు మద్దతు ఇవ్వడంపై అమెరికా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణతో పాటు, పాత్రికేయ స్వతంత్రతను గౌరవించడం కూడా అమెరికా-భారత్ మధ్య సంబంధాలకు పునాదిరాయి వంటిదని వేదాంత్ పటేల్ వివరించారు. కాగా, సనా మట్టూను ఢిల్లీ ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకోవడంపై తమకు పూర్తి సమాచారం లేదని, దీనిపై తాము దృష్టి సారించామని తెలిపారు. శ్రీనగర్ కు చెందిన సనా మట్టూ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ లో పనిచేస్తున్నారు. కొవిడ్ సంక్షోభ సమయంలో భారత్ లోని పరిస్థితిని ఓ ఫొటో జర్నలిస్టుగా మిగతా ప్రపంచానికి తెలియజేశారు.