ప్రతిసారి పాటించే ఆచారాన్నే ఈ ఏడాది కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ కొనసాగించారు. నేడు దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ సరిహద్దుల్లోని కార్గిల్ సెక్టార్ ను సందర్శించారు. అక్కడ భారత జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. మోదీ ప్రతి ఏడాది సైనికులతో కలిసి దీపావళి జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇవాళ కార్గిల్ లో సైనిక స్థావరానికి వెళ్లిన ఆయన అక్కడి జవాన్లతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. వారితో కలిసి ఆడిపాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. పండుగ రోజున జవాన్లను కలుసుకోవడం సంతోషం కలిగించిందని అన్నారు. జవాన్లు తన కుటుంబ సభ్యులు అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. దేశాన్ని రక్షిస్తున్న సైనికులను చూస్తుంటే గర్వంగా ఉందని, వారి వల్లే దేశంలో శాంతిభద్రతలు నెలకొన్నాయని వెల్లడించారు. దేశభక్తి దైవభక్తితో సమానమని మోదీ అభివర్ణించారు.