ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖనే కార్య నిర్వాహక రాజధానిగా ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉద్ఘాటించారు. విశాఖ రాజధాని సాధనే తమ ధ్యేయమని తేల్చి చెప్పారు. విశాఖ రాజధాని సాధన ఐక్య వేదిక నేతృత్వాన స్థానిక సన్ రైజ్ హోటల్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. నాన్ పొలిటికల్ జేఏసీ తరఫున జరుగుతున్న ఉద్యమానికి కొనసాగింపుగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో చాలా భిన్నమయిన అభిప్రాయాలు ఉన్నాయి. మాకు అన్యాయం జరిగింది అని చెప్పేవాళ్లు.. ఈ రాష్ట్రంలో మేం వెనుకబడిపోయాం అని చెప్పేవాళ్లు ఉన్నారు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధానే విశాఖ అని గొంతుక వినిపించకపోతే మళ్లీ మేం వెనకబడిపోతాం అన్న భయం అయితే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన విధంగా పునర్విభజన చట్టం సెక్షన్ 6 అన్నది పరిపాలన వికేంద్రీకరణను ధ్రువీకరిస్తోంది అని తెలియజేసారు.