అన్నమయ్య జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారులు ఎన్హెచ్ 71 మదనపల్లి నుండి పీలేరు, ఎన్హెచ్ 716 కడప నుండి రేణిగుంట మార్గంలో రాజంపేట డివిజన్ పరిధిలో ఇప్పటికే సేకరించి అవార్డు పాస్ చేసిన భూములకు త్వరితగతిన నష్టపరిహారం చెల్లింపులు చేయాలని జిల్లా కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులకు ఇప్పటికే సేకరించిన భూములకు సంబంధించి లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లింపు అంశంపై ఆర్డీఓలు, తాసిల్దార్లు, ఎన్ హెచ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో ఎన్హెచ్ 71 కింద మదనపల్లి నుంచి పీలేరు వరకు వాయల్పాడు, కలికిరి, మదనపల్లి, పీలేరు నాలుగు మండలాల్లోని 17 గ్రామాలలో 456. 88 ఎకరాలు సేకరించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 1921 మంది పట్టాదారులకు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉండగా. 223. 248 ఎకరాలకు సంబంధించి 945 మంది పట్టాదారులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు. ఇంకనూ 976 మంది పట్టాదారులకు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంది. అలాగే ఎన్. హెచ్ 716 కింద కడప నుంచి రేణిగుంట మార్గంలో రాజంపేట డివిజన్కు సంబంధించి 72కిమీల మేర నిర్మిస్తున్న జాతీయ రహదారిలో నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లి పుల్లంపేట, రైల్వేకోడూరు 5 మండలాల్లోని 24 గ్రామాలలో 459. 70 ఎకరాలు సేకరించడం జరిగిందన్నారు. అయ్యా డివిజన్ల పరిధిలో ఇప్పటికే సేకరించిన భూములకు సంబంధించి లబ్ధిదారులకు త్వరితగతిన నష్టపరిహారం చెల్లించేందుకు ఆర్డీఓలు, తహశీల్దార్లు కృషి చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియలన్నీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆయా అంశాలలో పెండింగ్లో ఉన్న ఫైల్స్ వచ్చే వారంలో దాదాపు 50 శాతం తప్పనిసరిగా పరిష్కరించాలని తాసిల్దార్ లకు సూచించారు. ఇందులో భాగంగా భూసేకరణ జరిపిన లబ్ధిదారులలో కొంతమంది ఇతర ప్రాంతాల్లో ఉన్నారని తాసిల్దార్లు కలెక్టరుకు వివరించారు. వీఆర్వోలు గ్రామాలలో విచారించి సంబంధిత లబ్ధిదారుల చిరునామాలు కనుగొని సమాచారం అందజేసి నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.