అటవీ భూముల్లో రైలు మార్గం ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సోమందేపల్లి మండలంలోని పత్తికుంటపల్లి, వెలదడకల గ్రామాల ప్రజలు కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే శంకర్ నారాయణకు బాధిత గ్రామాల ప్రజలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పత్తికుంటపల్లి, వెలదడకల, కొలింపల్లి గ్రామాల మీదుగా నూతన రైలు మార్గం ఏర్పాటుకు అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారని ఈ గ్రామాల్లో అందరూ చిన్న కమతాలు కలిగిన చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన 70 ఎకరాల భూమి, 10 బోర్లు, కోళు ఫారాలు, నష్టపోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మార్గం కంటే తక్కువ దూరంలో అటవీ మార్గంలో రైలు మార్గం ఏర్పాటుకు అవకాశం ఉన్న కూడా అధికారులు పచ్చని పంట పొలాలు నష్టం వాటిల్లే విధంగా రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. రైల్వే అధికారులతో మాట్లాడి అటవీ ప్రాంతంలో రైలు మార్గం ఏర్పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచి నిర్మలమ్మ శ్రీనివాసరెడ్డి, వైసిపి మండల కన్వీనర్ నారాయణరెడ్డి, ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, జెడ్పీటీసీ డిసి అశోక్, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.