జార్ఖండ్‌లోని గుర్పా రైల్వేస్టేషన్ సమీపంలో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. బుధవారం ఉదయం 6.24 గంటల సమయంలో ధన్‌బాద్ డివిజన్‌లోని కోడెర్మా, మన్పూర్ రైల్వే సెక్షన్ల మధ్య బొగ్గుతో కూడిన గూడ్స్ రైలుకు చెందిన 53 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. వ్యాగన్లలో ఉన్న బొగ్గు నేలపాలైంది. కొన్ని వ్యాగన్ల చక్రాలు ఊడి పక్కకు పడిపోయాయి. బుధవారం ఉదయం 6.24 గంటల సమయంలో ధన్‌బాద్ డివిజన్‌లోని గుర్పా స్టేషన్ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పిందని అధికారులు వెల్లడించారు. అయితే అదేసమయంలో ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తూర్పు సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ఈ ప్రమాదం వల్ల ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా వ్యాగన్లను పక్కకు తొలగిస్తామని పేర్కొన్నారు. వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్న రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామన్నారు.