పెట్రోల్ ధరలు మండటంతో వాహన ప్రియులు అంతా ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఓలా చాలా ముందు నుంచే కార్ల ప్రియులను టీజర్లతో ఊరిస్తోంది. తాజాగా మరో విడత ఓలా ఎస్1 ఎయిర్ చౌక ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల సందర్భంలోనూ ఎలక్ట్రిక్ కారుపై టీజర్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో చెప్పుకోతగ్గ మార్కెట్ వాటా సొంతం చేసుకున్న ఈ సంస్థ ప్యాసింజర్ కార్ల విభాగంలోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది.
‘‘నాలుగు చక్రాలపై ఇది ఒక కలగా మారబోతోంది. మాకు మాదిరే మీరు కూడా ఈ కారు విషయంలో ఎంతో ఆసక్తిగా ఉన్నారని తెలుసు’’అంటూ ఓలా ట్వీట్ చేసింది. ఓలా లోగడ కూడా ఎలక్ట్రిక్ కారు బాడీపై టీజర్ విడుదల చేసింది. తాజా టీజర్ లోనూ కేవలం కారు బాడీనే కొంత మేర చూపిస్తున్నట్టు ఉంది. దీంతో కేవలం డిజైన్ వరకే పూర్తయినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ కారును 2024లో విడుదల చేయాలన్నది ఓలా లక్ష్యం. ప్యాసింజర్ కార్లలో ఎస్ యూవీలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. కనుక ఓలా కారు సైతం ఈ విభాగంలోనే ఉంటుందని అంచనా. అదే సమయంలో అత్యాధునిక ఫీచర్లను (ఇప్పటి వరకు ఐసీఈ కార్లలో లేని విధంగా) ఈ కారుతో ఓలా పరిచయం చేస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.